పర్యావరణ విద్యకు ప్రోత్సాహం
విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించిన ఉత్తరాఖండ్ అటవీ శిక్షణ అకాడమీ
సూర్య జాతీయ డెస్క్: యువతలో పర్యావరణ విద్యను, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంచే లక్ష్యంతో ఉత్తరాఖండ్ అటవీ శిక్షణ అకాడమీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ విస్తృత అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రాథమికంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు ఉచితంగా బస చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అకాడమీ వర్గాలు వెల్లడించాయి.
వీర్ సింగ్ గర్వాలీ ఉత్తరాఖండ్ ఉద్యానవన మరియు అటవీ విశ్వవిద్యాలయానికి చెందిన అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు అకాడమీ తెలిపింది. గతంలో విద్యార్థుల నుంచి సాధారణ వసతి రుసుము వసూలు చేసేవారు. అయితే ప్రభుత్వ అధికారుల నుంచి వసూలు చేసే రుసుమునే స్వతంత్ర ఆదాయం లేని విద్యార్థుల నుంచి కూడా తీసుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని గుర్తించి ఈ రుసుమును పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు అకాడమీ డైరెక్టర్ సంజీవ్ చతుర్వేది సెప్టెంబర్ 9న పంపిన ప్రతిపాదనకు సంబంధిత శాఖ సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అన్ని ఆధునిక వసతులు కలిగిన అకాడమీకి చెందిన మయూరి హాస్టల్‌లో విద్యార్థులకు ఈ ఉచిత బస కల్పిస్తున్నారు. విద్యార్థుల నుంచి వచ్చే అభిప్రాయాలు, స్పందన ఆధారంగా భవిష్యత్తులో ఈ వసతి సమయాన్ని, పరిధిని మరిన్ని రోజులు విస్తరించే యోచనలో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
గతంలో కూడా సంజీవ్ చతుర్వేది రీసెర్చ్ వింగ్ చీఫ్ కన్జర్వేటర్‌గా ఉన్న సమయంలో పర్యావరణ అధ్యయనం కోసం ఉత్తరాఖండ్‌లోని 26 జీవవైవిధ్య కేంద్రాలను విద్యార్థులకు ఉచితంగా సందర్శించే వెసులుబాటు కల్పించారు. తాజాగా ప్రవేశపెట్టిన ఈ ఉచిత హాస్టల్ వసతి పథకం కూడా పర్యావరణ పరిశోధనలు, క్షేత్రస్థాయి అధ్యయనం చేసే విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు.