దిల్లీలో దారుణం: ప్రసిద్ధ కాలికాజీ ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్
సూర్య నేషనల్ డెస్క్: దేశ రాజధాని దిల్లీలో అమానుష ఘటన వెలుగు చూసింది. ప్రసిద్ధ కాలికాజీ ఆలయం సమీపంలో పోలీసులమంటూ నమ్మించి, ముగ్గురు దుండగులు కలిసి 17 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో పట్టుకోగా, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పూజకు వెళ్లిన జంటపై పోలీసుల వేషంలో వల
దిల్లీకి చెందిన 17 ఏళ్ల బాలిక, తన మిత్రుడితో కలిసి ప్రసిద్ధ కాలికాజీ ఆలయానికి దైవదర్శనానికి వెళ్లింది. దర్శనం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల ఉన్న 'ఆస్తా కంజ్' పార్కులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తమను తాము 'దిల్లీ పోలీసులు'గా పరిచయం చేసుకున్నారు. పార్కులో ఇలా ఉండటం చట్టవిరుద్ధమంటూ భయభ్రాంతులకు గురిచేసి, వివిధ చట్టపరమైన సెక్షన్ల పేరుతో ఆ యువతీయువకులను తీవ్రంగా బెదిరించారు.
కత్తి చూపించి, ఆశ్రయం లేని ప్రాంతానికి బలవంతంగా తరలించి..
కొంతసేపటికి ఆ యువకుడిని అక్కడి నుంచి తరిమికొట్టిన ఆ కేటుగాళ్లు, బాలికను మాత్రం బలవంతంగా పార్కులోని జనసంచారం లేని దట్టమైన పొదల ప్రాంతానికి లాక్కకెళ్లారు. అక్కడ బాలిక మెడపై కత్తి ఆనించి, తుపాకీతో బెదిరిస్తూ ఆ ముగ్గురు రాక్షసులు అమానుషంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి రోదనలను ఎవరూ పట్టించుకోలేని దుస్థితి నెలకొంది.
పోలీసుల ఎంట్రీ.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అమర్ కాలనీ పోలీసులు క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలను సురక్షితంగా రక్షించారు. నిందితులు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
కొన్ని గంటల పాటు గాలించిన అనంతరం నిందితులు తలదాచుకున్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ధరించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌పై తూటా దూసుకెళ్లింది. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రధాన నిందితుడైన ఆసిఫ్ కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కఠిన చట్టాల కింద కేసులు నమోదు.. పరారీలో మరోిద్దరు
ఈ ఘోరకలికి పాల్పడిన నిందితులపై కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయన్యాయ సంహిత (BNS) మరియు పోక్సో (POCSO) చట్టం కింద పోలీసులు కఠిన కేసులు నమోదు చేశారు. ఈ దారుణంలో పాలుపంచుకుని పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దేశ రాజధానిలో, అది కూడా పోలీసు వేషధారణలో వచ్చి మైనర్ బాలికపై జరిగిన ఈ సామూహిక అత్యాచార ఘటన దిల్లీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.