భారీ వర్షాల హెచ్చరిక
అమరావతి/హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 22 రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి సుమారు 180 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు సుమారు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది.
కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం
తీవ్ర వాయుగుండం విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య, కళింగపట్నానికి సమీపంలో బుధవారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీర ప్రాంతాల్లో గంటకు 25–30 నాటికల్ మైళ్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 40 నాటికల్ మైళ్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.
పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబర్ స్థానిక హెచ్చరిక సంకేతాలను కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లోనూ అప్రమత్తత సూచనలు జారీ చేశారు.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కోస్తాంధ్రలోనూ ఈ రెండు రోజులు అతి భారీ వర్షాల ముప్పు ఉందని ఐఎండీ పేర్కొంది.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువుల పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు తీవ్రతరం అయితే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున స్థానిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.