ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర కలకలం: భార్య, ఇద్దరు పూజారులను కాల్చిచంపి.. పిల్లలను బందీగా చేసుకున్న నిందితుడు ఎన్‌కౌంటర్
సూర్య నేషనల్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాలో అత్యంత భయానక ఘటన చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగా లేదనే అనుమానంతో ఇంట్లో పూజ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన భార్యతో పాటు ఇద్దరు పూజారులను అత్యంత కిరాతకంగా కాల్చిచంపాడు. అనంతరం తన ముగ్గురు పసిపిల్లలను ఓ గదిలో బందీగా చేసుకుని పోలీసులకు సవాల్ విసిరాడు. దాదాపు ఏడు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైడ్రామా చివరకు పోలీసుల ఎదురుకాల్పులు, నిందితుడి మృతితో ముగిసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూజ సమయంలోనే వివాదం.. రక్తమోడిన ఇల్లు
ఆజంగఢ్ జిల్లా అహ్రౌలా ప్రాంతంలోని శంభుపూర్ గ్రామానికి చెందిన అరవింద్ సింగ్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి భార్య బబితా సింగ్ (32), కుమార్తె పరి (5), కుమారుడు లక్కా (6)తో పాటు ఏడు నెలల వయసున్న మరో చిన్నారి ఉన్నారు. అయితే గత కొంతకాలంగా అరవింద్ మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబసభ్యులు భావించారు. ఈ నేపథ్యంలో అతని ఆరోగ్యం కుదుటపడాలనే ఉద్దేశంతో భార్య బబితా సింగ్ ఇంట్లోనే ప్రత్యేక పూజ నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా స్థానిక పూజారులు మహేంద్ర పాఠక్ (60), అఖిలేశ్ మిశ్రా (50)లను ఇంటికి ఆహ్వానించింది.
మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఇంట్లో పూజా కార్యక్రమం జరుగుతుండగా అరవింద్ అక్కడికి వచ్చాడు. ఇంట్లో పూజారులు ఉండటాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పూజ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ వారిని నిలదీయడమే కాకుండా, వారి ఆధార్ కార్డులు చూపించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అరవింద్ తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ పిస్టల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భార్య బబితాతో పాటు పూజారులు మహేంద్ర పాఠక్, అఖిలేశ్ మిశ్రా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఏడు గంటల హైడ్రామా.. పిల్లలను బందీగా చేసుకుని బెదిరింపులు
కాల్పుల అనంతరం మరింత ఆవేశానికి గురైన అరవింద్ సింగ్, ఇంట్లోని తన ముగ్గురు పసిపిల్లలను తీసుకుని ఓ గదిలోకి వెళ్లి లోపల నుంచి గెడ వేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న నిందితుడి తల్లి సమ్లా దేవి (70) ప్రాణభయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని చుట్టుముట్టి అరవింద్‌ను లొంగిపోవాలని గట్టిగా హెచ్చరించారు. అయితే పోలీసుల హెచ్చరికలను అతడు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా పోలీసులపైకి బెదిరింపులకు దిగుతూ, గదిలోకి వస్తే పిల్లలను చంపేస్తానని హెచ్చరించాడు. ఆ సమయంలో జరిగిన గందరగోళంలో ఓ చిన్నారికి గాయాలయ్యాయి.
రంగంలోకి ఏటీఎస్, ఎస్‌ఓజీ బృందాలు
సుమారు ఏడు గంటల పాటు పోలీసులు ఎంత నచ్చజెప్పినా అరవింద్ గది తలుపులు తెరవలేదు. ఉదయం అధికారులతో మాట్లాడతానని లొంగిపోయేందుకు నిరాకరించాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి 12:20 గంటల సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) బలగాలను రంగంలోకి దించారు. ఏడీజీ నవీన్ అరోరా, ఎస్పీ అనిల్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. పసిపిల్లల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు.
తలుపులు బద్దలు కొట్టి ప్రవేశించిన పోలీసులు.. ఎదురుకాల్పులు
గదిలో ఉన్న ముగ్గురు పిల్లలను సురక్షితంగా కాపాడేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. ముందుగా గదిలోకి స్టన్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ గ్రెనేడ్లను ప్రయోగించారు. ఆ వెంటనే ఎస్పీ అనిల్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బలగాలు గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాయి. పోలీసులు లోపలికి వస్తున్న సమయంలో నిందితుడు అరవింద్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారిపైకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో అరవింద్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు.