బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కలకలం: నేడు రాత్రికి విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం మరింత తీవ్రరూపం దాల్చి కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతానికి ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 100 కి.మీ, ఒడిశాలోని పూరీకి 220 కి.మీ అలాగే విశాఖపట్నానికి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు.
వాతావరణ పరిస్థితుల ప్రకారం బుధవారం రాత్రికి ఈ తీవ్ర వాయుగుండం విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, ప్రజలు మరియు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.