ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతి అభివృద్ధికి భారీ నిధులు
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ భేటీలో దాదాపు 60కి పైగా అజెండా అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేసే దిశగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మరియు కర్నూలు కేంద్రాలుగా ఈ కొత్త కమిషనరేట్లు ఏర్పాటవుతుండగా, వాటి పరిధిలోని జోన్లు మరియు సబ్‌డివిజన్ల వివరాలను అధికారులు ఖరారు చేశారు.
అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి మరియు మౌలిక వసతుల విస్తరణకు ఈ కేబినెట్ సమావేశంలో పెద్దపీట వేశారు. అమరావతిలో అసెంబ్లీ ఐకానిక్ భవనంపై 250 మీటర్ల స్పైర్ నిర్మాణంతో పాటు రూఫ్, లిఫ్టుల పనుల నిమిత్తం రూ.661 కోట్ల ప్రతిపాదనలకు, అలాగే 29 గ్రామాల ఎల్‌పీఎస్ లేఅవుట్లలో రూ.1,548 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం లభించింది. అంతేకాకుండా రెండో దశ భూసమీకరణలో భాగంగా ఎకరా కంటే తక్కువ భూమి ఉన్న రైతులందరికీ ఏటా రూ. 40 వేల చొప్పున కౌలు చెల్లించే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది.
రాష్ట్రంలో పారిశ్రామికీకరణను వేగవంతం చేసేలా ఐటీ మరియు క్వాంటం టెక్నాలజీ రంగాలకు భారీ ప్రోత్సాహకాలను కేబినెట్ ప్రకటించింది. ఇటీవల జరిగిన ఎస్ఐపీబీ (SIPB) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా విశాఖపట్నంలో డెలాయిట్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ కార్పొరేట్ ఆపరేషన్స్ కేంద్రాలు, అలాగే కడపలో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్, సృష్టి క్వాంటం, క్వాంటం కోడాన్, అరోహాక్ టెక్నాలజీస్, ట్రైక్వాంటా ల్యాబ్స్, ఫోటాన్‌కోర్ సిస్టమ్స్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం ముద్ర పడింది. విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ తదితర అంశాలపై కూడా మంత్రివర్గంలో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.