₹5,500 కోట్ల పెట్టుబడితో గ్వాలియర్‌లో ఆసియాలోనే తొలి టెలికాం తయారీ జోన్
సూర్య జాతీయ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరం ఒక ప్రధాన టెలికాం తయారీ కేంద్రంగా మారబోతోంది. సుమారు ₹5,500 కోట్ల భారీ పెట్టుబడితో, 18,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పించేలా ఆసియాలోనే మొట్టమొదటి 'టెలికాం తయారీ జోన్' (TMZ)ను గ్వాలియర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదివారం నాడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి 'శ్రీమంత్ మాధవరావు సింధియా కౌంటర్ మాగ్నెట్ సీటీ' (SADA) పరిధిలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్వాలియర్‌లో 24-25 టెలికాం పరికరాల తయారీ యూనిట్లతో కూడిన సమగ్ర పారిశ్రామిక వ్యవస్థ ఏర్పడనుందని తెలిపారు.
ఈ ప్రతిపాదిత తయారీ జోన్ మొదటి దశ విస్తరణ కోసం SADA పరిధిలో 90 ఎకరాలకు పైగా, ఐటీ పార్క్‌లో 70 ఎకరాలకు పైగా కలిపి మొత్తం 170 ఎకరాల భూమిని సేకరించారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల సంఖ్య లభ్యత కంటే ఎక్కువగా ఉండటంతో, అవసరమైతే అదనపు భూమిని కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం జూలై 2026లో టెలికమ్యూనికేషన్ల శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఎంవోయూ కుదిరింది. ఆగస్టులో నిర్వహించిన రోడ్‌షోల ద్వారా ఢిల్లీ నుంచి ₹3,500 కోట్లు, ముంబై నుంచి ₹2,000 కోట్ల పెట్టుబడి హామీలు లభించాయి. ప్రస్తుతం 24 కంపెనీలు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి.
ఈ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భూమి, విద్యుత్, ఉపాధి మరియు ఉత్పత్తి ఆధారిత ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించింది. అలాగే కేంద్ర టెలికం శాఖ ₹500 కోట్ల వ్యయంతో కామన్ టెస్టింగ్ ల్యాబ్ ప్యాకేజీని సమకూర్చనుంది. ఆగ్రా-గ్వాలియర్ హైస్పీడ్ కారిడార్, ఆధునీకరించిన విమానాశ్రయం మరియు బలమైన రైలు మార్గాలు గ్వాలియర్‌కు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చనున్నాయి. ప్రతిఏటా నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకు వచ్చే 25,000 మంది విద్యార్థుల నైపుణ్యాలు ఈ తయారీ రంగానికి ఎంతగానో తోడ్పడతాయని అధికారులు భావిస్తున్నారు.