అంతర్-రాష్ట్ర మండలి ఉత్తర్వు 1990కి సవరణ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం
సూర్య జాతీయ డెస్క్: సంబంధిత రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలు లేదా రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు, అంతర్-రాష్ట్ర మండలి సమావేశాలలో గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొనేలా రాజ్యాంగ సవరణ చేశారు. ఈ మేరకు 'అంతర్-రాష్ట్ర మండలి ఉత్తర్వు, 1990'ని సవరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ఆదేశాలు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 కల్పించిన అధికారాల ప్రకారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'అంతర్-రాష్ట్ర మండలి (సవరణ) ఉత్తర్వు, 2026' పేరిట విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ తక్షణమే అమలులోకి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.
సవరించిన నూతన ఉత్తర్వు ప్రకారం 1990 నాటి అసలు ఉత్తర్వులోని క్లాజ్ 2 స్థానంలో ఒక కొత్త నిబంధనను చేర్చారు. ప్రధానంగా నాలుగు ప్రత్యేక సందర్భాలలో సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు లేదా కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను మండలి సమావేశాలకు ఆహ్వానించాలని ఈ సవరణ స్పష్టంచేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ను సమావేశానికి ఆహ్వానించాల్సి ఉంటుంది. అదేవిధంగా రాజధాని ఢిల్లీలో ఆర్టికల్ 239AB కింద రాష్ట్రపతి ఉత్తర్వు అమలులో ఉన్నప్పుడు అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొనవలసి ఉంటుంది.
కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్‌ల విషయంలోనూ స్పష్టమైన నిబంధనలను పొందుపరిచారు. పుదుచ్చేరిలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం 1963 లోని సెక్షన్ 51 కింద రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో ఉన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్‌లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 లోని సెక్షన్ 73 కింద రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు సంబంధిత లెఫ్టినెంట్ గవర్నర్లను ఈ సమావేశాలకు ఆహ్వానిస్తారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం, సమన్వయం కోసం ఆర్టికల్ 263 ద్వారా మే 28, 1990న ఏర్పాటు చేసిన అంతర్-రాష్ట్ర మండలిని గతంలో డిసెంబర్ 1996లో సవరించగా, తాజాగా మరొకసారి కీలక మార్పులు చేశారు.