న్యూఢిల్లీలో పేజావర మఠాధిపతితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ
సూర్య జాతీయ డెస్క్: కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా సోమవారం న్యూఢిల్లీలో పేజావర మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జాతీయ రాజధాని ఢిల్లీలో స్వామీజీ నిర్వహిస్తున్న 39వ పవిత్ర చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పీఠాధిపతిని దర్శించుకుని వారి దివ్యాశీస్సులు పొందడం పట్ల కేంద్ర హోంమంత్రి అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తన అనుభూతిని పంచుకున్నారు.
ధ్యానం, సంయమనం మరియు అంతర్గత చైతన్యం ద్వారా సమాజానికి త్యాగ గుణాన్ని, పవిత్ర సాంప్రదాయాన్ని పరిచయం చేయడంలో చాతుర్మాస్య వ్రతానికి విశిష్టమైన స్థానం ఉందని అమిత్ షా కొనియాడారు. శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ అందించే ఆధ్యాత్మిక బోధనలు, వారి అంతర్గత తేజస్సు మానవాళి సంక్షేమానికి ఎల్లప్పుడూ సన్మార్గం చూపే మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా చర్చ సాగినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉడిపి కేంద్రంగా ఉన్న ఎనిమిది ప్రముఖ మధ్వ సంప్రదాయ మఠాలలో పేజావర మఠం ఎంతో ప్రాశస్త్యం పొందింది. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించడంతో పాటు విస్తృతమైన ధార్మిక కార్యకలాపాలను నిర్వహించడంలో ఈ మఠం ప్రసిద్ధి చెందింది. ఈ భేటీలో పలువురు ప్రముఖులు, మఠం ప్రతినిధులు పాల్గొన్నారు.