ఐఎఫ్ఎఫ్ఐ 2026 ముగింపు చిత్రం వీ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: కుటుంబం అంటే రక్తసంబంధమా లేక పరస్పర అవగాహన, అంగీకారంతో ఏర్పడే బంధమా అనే కీలక ప్రశ్న చుట్టూ 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఐఎఫ్ఎఫ్ఐ ముగింపు చిత్రం వీ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్ కథ నడుస్తుంది. కుటుంబ సంబంధాలు, యుక్తవయస్సు సవాళ్లు, ఆత్మీయతలోని నిజమైన అర్థాన్ని ఈ చిత్రం హృద్యంగా ఆవిష్కరిస్తోంది. ఆంథోనీ చెన్ దర్శకత్వం వహించిన 157 నిమిషాల ఈ చిత్రం మాండరిన్, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కింది. ప్రస్తుత సింగపూర్ నేపథ్యంలో సాగే ఈ కథలో 21 ఏళ్ల జున్యాంగ్, అతని తండ్రి బూన్ కియాట్ జీవితాలు కొత్త సంబంధాలు, అనూహ్య బాధ్యతల వల్ల ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూపించారు. నలుగురు వ్యక్తులు ఒకే ఇంట్లో కలిసి ఉండటం ప్రారంభించిన తర్వాత తమ భేదాలను అధిగమిస్తూ, సాంప్రదాయ కుటుంబ భావనలను సవాలు చేసే కొత్త బంధాలను ఏర్పరుచుకుంటారు.
ఈ చిత్రంలో జున్యాంగ్ పాత్ర పోషించిన సింగపూర్ నటుడు కో జియా లెర్, లిడియా పాత్రలో నటించిన రెజీన్ లిమ్ శనివారం గోవాలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇలో ఇలో 2013, వెట్ సీజన్ 2019 చిత్రాల తర్వాత చెన్ రూపొందించిన గ్రోయింగ్ అప్ త్రయీలో ఇది చివరి చిత్రం. చెన్‌తో కలిసి చేసిన ప్రయాణంలో తన నటనా నైపుణ్యం ఎదిగిందని కో జియా లెర్ తెలిపారు. ఎలాంటి నటనా శిక్షణ లేకపోయినా దాదాపు 8,000 మంది పిల్లల్లో తనను ఎంపిక చేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. వేసవి సెలవుల్లో సరదాగా మొదలైన ఆ అనుభవం క్రమంగా సినిమా, నటన పట్ల లోతైన ఆసక్తిగా మారిందని చెప్పారు.
తన పాత్ర గురించి మాట్లాడుతూ, సమాజంలో తన స్థానాన్ని వెతుక్కుంటూనే జున్యాంగ్ కుటుంబ బాధ్యతలను మోయాల్సి వస్తుందని, తన వ్యక్తిగత అనుభవాలు కూడా ఈ పాత్ర చిత్రణకు తోడ్పడ్డాయని కో జియా లెర్ వివరించారు. పెద్దరికంలోకి అడుగుపెట్టడం, కఠిన నిర్ణయాలు తీసుకోవడం, దారిని వెతుక్కోవడం వంటి సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు సుపరిచితమైనవేనని అన్నారు. తండ్రీకొడుకుల వంటి రక్తసంబంధీకులు కూడా ఒకరికొకరు అపరిచితులుగా మిగిలిపోయే పరిస్థితిని సినిమా టైటిల్ ప్రతిబింబిస్తుందని రెజీన్ లిమ్ పేర్కొన్నారు. నలుగురు పాత్రలు కలిసి జీవించడం మొదలుపెట్టిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, భావోద్వేగ బంధాలు, పరస్పర అవగాహనతోనే కుటుంబం నిలుస్తుందనే వాస్తవాన్ని గ్రహిస్తారని చెప్పారు.
నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్ అభ్యసించిన తర్వాత తిరిగి నటన వైపు రావడం తనలో నటనా ఆసక్తిని మరింత పెంచిందని లిమ్ తెలిపారు. విభిన్న జీవితాలు, దేశాలు, సంస్కృతులను ప్రేక్షకులకు పరిచయం చేసే మాధ్యమంగా సినిమాను అభివర్ణించారు. సింగపూర్ అంటే కేవలం ఆర్థిక శ్రేయస్సు మాత్రమే కాకుండా, అక్కడి సాధారణ ప్రజల దైనందిన జీవితాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు ఈ చిత్రం పరిచయం చేస్తుందని కో జియా లెర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబం, బాధ్యత, ఎదుగుదలలోని అనిశ్చితులను చిత్రీకరిస్తూ ఐఎఫ్ఎఫ్ఐ 2026 ఇతివృత్తమైన సరిహద్దులు లేని కథలకు ఈ సినిమా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. విభిన్న సంస్కృతులు, ప్రాంతాల ప్రజలను ఉమ్మడి భావోద్వేగాలు, అనుభవాలు ఎలా ఏకం చేస్తాయో ఈ చిత్రం చాటిచెబుతుంది.