షేక్ హసీనా పార్టీ నిరసనల వేళ మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు
సూర్య అంతర్జాతీయ డెస్క్: బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని నిషేధిత అవామీ లీగ్ గురువారం లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు ప్రాంతాలలో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో మాజీ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్‌కు చెందిన పూర్వీకుల ఇంటికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. చటోగ్రామ్ నగరంలోని పాంచ్‌లైష్ ప్రాంతంలో ఉన్న యూనస్ పూర్వీకుల నివాసంలోని ఖాళీగా ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగగా, గస్తీ పోలీసులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. భవనం పై అంతస్తులలో యూనస్ సోదరుల కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
రాజధాని ఢాకాలో తెల్లవారుజామున నాటు బాంబుల పేలుళ్లు, విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు, పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలలో కనీసం నలుగురు గాయపడినట్లు సమాచారం. భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు ఢాకాలోని ప్రధాన ఫ్లైఓవర్ల వద్ద అదనపు బలగాలను మోహరించి, నగర ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఢాకాలో ఇద్దరు అవామీ లీగ్ నేతల నివాసాలపై దాడులు జరిగాయని, పలు జిల్లాల్లో వాహనాలు, భవనాలకు నిప్పు పెట్టిన ఘటనలలో ఒక బస్సు సహాయకుడు మృతి చెందాడని నివేదికలు పేర్కొంటున్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాలలో యూనస్ స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ శాఖలపైనా దాడులు, నిప్పు పెట్టే ఘటనలు చోటు చేసుకున్నాయి. చటోగ్రామ్, రాజ్‌షాహి, హబీగంజ్, టాంగైల్ మరియు బారిషాల్ ప్రాంతాలలో గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. గారోమెంట్ కార్మికుల వేతన డిమాండ్ల ఆందోళనలు, రాజకీయ నిరసనలు ఒకేసారి తలెత్తడంతో పలు పారిశ్రామిక ప్రాంతాలలో జనజీవనం, కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
ఈ హింసాత్మక ఘటనలపై బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ తీవ్రంగా స్పందిస్తూ, అల్లర్లు మరియు నిప్పు పెట్టే ఘటనలకు పాల్పడిన వారిని ఆడియో, వీడియో ఆధారాల ద్వారా గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశంలో శాంతిభద్రతలను కాపాడేందుకు భద్రతా బలగాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం సూచించింది.