లైట్ డే మైలురాయి చేరుకున్న వాయేజర్-1
సూర్య అంతర్జాతీయ డెస్క్: అంతరిక్ష ప్రయాణ చరిత్రలో నాసాకు చెందిన వాయేజర్-1 వ్యోమనౌక మరో అరుదైన మైలురాయిని చేరుకుందని అమెరికా అంతరిక్ష సంస్థ అంచనా వేసింది. భూమి నుంచి ఒక లైట్ డే దూరానికి చేరుకున్న తొలి మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్-1 నిలిచిందని నాసా గణనలు వెల్లడించాయి. కాంతి 24 గంటల్లో ప్రయాణించే దూరమే ఒక లైట్ డే కాగా, ఇది సుమారు 16 బిలియన్ మైళ్లు లేదా 26 బిలియన్ కిలోమీటర్లకు సమానం. బుధవారం ఉదయం 5.16 గంటలకు వాయేజర్-1 ఈ దూరాన్ని చేరుకుందని నాసా లెక్కగట్టగా, కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ అధికారులకు ఆ నౌక నుంచి సంకేతాలు అందడానికి సుమారు ఒక రోజు సమయం పట్టనుంది. ఈ ఘనతపై చర్చించేందుకు గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
1977లో ప్రయోగించిన వాయేజర్-1 ప్రస్తుతం గంటకు దాదాపు 38 వేల మైళ్లు లేదా 61 వేల కిలోమీటర్ల వేగంతో నక్షత్రాంతర అంతరిక్షంలో ప్రయాణిస్తోంది. సూర్యుడి ప్రభావంతో ఏర్పడే అయస్కాంత క్షేత్రాలు, కణాల రక్షణ కవచమైన హీలియోస్పియర్ అంచును దాటి 2012లో ఇది నక్షత్రాంతర అంతరిక్షంలోకి ప్రవేశించింది. ఇదే సమయంలో ప్రయోగించిన జంట నౌక వాయేజర్-2 కూడా 2018లో నక్షత్రాంతర అంతరిక్షంలోకి అడుగుపెట్టింది. ఒక లైట్ డే దూరాన్ని చేరుకోవడం ఊహించని అద్భుత ఘనత అని వాయేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ సుజాన్ డాడ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల చేపట్టిన విద్యుత్ పొదుపు చర్యల వల్ల ఈ రెండు వాయేజర్ నౌకలు భూమితో మరో మూడేళ్ల నుంచి నాలుగేళ్ల పాటు సంభాషణలు కొనసాగించే అవకాశం ఉందని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ ప్రతినిధి తెలిపారు. వచ్చే ఏడాది ప్రయోగం జరిగి 50 ఏళ్లు పూర్తయ్యే నాటికి పరిశోధన పరికరాలు పనిచేసేంత శక్తి ఉందని, ఆ తర్వాత ఏమి జరుగుతుందనేది అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. దాదాపు 50 ఏళ్ల నాటి నౌకలు కావడంతో ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
గతంలో సౌర వ్యవస్థలోని అతిపెద్ద గ్రహాలైన బృహస్పతి, శని గ్రహాల సమీపం నుంచి ప్రయాణించిన వాయేజర్-1 ఇప్పటికీ శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తూనే ఉంది. నక్షత్రాంతర అంతరిక్షంలోని స్వల్ప వాయువుల కంపనల వల్ల ఏర్పడే శబ్దాలను, అయస్కాంత క్షేత్రాలు, కాస్మిక్ కిరణాలు మరియు ప్లాస్మా తరంగాల వివరాలను డీప్ స్పేస్ నెట్‌వర్క్ ద్వారా ఇది భూమికి పంపుతోంది. సూర్యుడి ప్రభావం ఎక్కడ ముగుస్తుందో, స్వచ్ఛమైన నక్షత్రాంతర అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందో తెలుసుకునే దిశగా ఈ ప్రయాణం సాగుతోందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.