నేపాల్‌లో చిక్కుకుపోయిన 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్లు
సూర్య అంతర్జాతీయ డెస్క్: మధ్య నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, అకస్మాత్తుగా విరుచుకుపడిన వరదల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రసిద్ధ మనస్లు (Manaslu) ట్రెకింగ్ రూట్‌లో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్లు చిక్కుకుపోయారు. గూర్ఖా జిల్లాలోని చుమ్నూబ్రి గ్రామం వద్ద సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడి బుధి గండకి నది ప్రవాహాన్ని అడ్డుకోవడంతో దిగువ ప్రాంతాల్లో ఉద్ధృతంగా వరదలు సంభవించాయి. ఈ వరదల దాటికి కొండ ప్రాంతాల్లోని కాలినడక మార్గాలు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిని కొట్టుకుపోవడంతో ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి.
నదిలో వరద నీరు పెరగడం మరియు మార్గాలు తెగిపోవడంతో వేలాది మీటర్ల ఎత్తులో ఉన్న విదేశీ పర్యాటకులు, స్థానిక మార్గదర్శకులు సురక్షిత ప్రాంతాలకు తిరిగి రాలేకపోతున్నారు. ఈ పరిణామంపై మనస్లు కన్జర్వేషన్ ఏరియా ప్రాజెక్ట్ అధికారి భువన్ రాజ్ ఓజా స్పందిస్తూ, ట్రెకింగ్ మార్గాల్లో అనేక మంది విదేశీయులు చిక్కుకున్నారని, వారిని వెనక్కి తీసుకురావడానికి సహాయక చర్యలు అవసరమని తెలిపారు. ప్రస్తుతం బాధితులు మార్గమధ్యంలోని హోటళ్లు, టీ హౌస్‌లలో సురక్షితంగానే ఉన్నారని, వారికి ఎలాంటి ప్రాణహాని లేదని స్పష్టం చేశారు.
పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన నేపాల్ సైన్యం, సాయుధ పోలీసులు రంగంలోకి దిగి విస్తృత హెలికాప్టర్ సహాయక చర్యలను చేపట్టారు. ఇప్పటివరకు 9 మంది విదేశీయులతో సహా మొత్తం 96 మందిని సైనిక బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కాగా ఈ అకస్మాత్తు వరదల వల్ల ఇళ్లు, మౌలిక వసతులు, మూడు జలవిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ఊరట వ్యక్తం చేశారు. కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడే ముప్పుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, పర్వత ప్రాంత పర్యాటకులు మరియు స్థానిక గ్రామాల రక్షణకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. చిక్కుకుపోయిన విదేశీ ట్రెక్కర్లను త్వరితగతిన కాపాడేందుకు నేపాల్ ఆర్మీ తన రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. పర్యాటకుల సురక్షిత పునరావాసం కోసం పర్యాటక శాఖ, స్థానిక పరిపాలనా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.