మాంచెస్టర్ సినగాగ్ దాడి ఘటనపై బ్రిటన్ బహిరంగ విచారణ
సూర్య అంతర్జాతీయ డెస్క్: గత ఏడాది మాంచెస్టర్‌లోని ప్రసిద్ధ హెటన్ పార్క్ హీబ్రూ కాంగ్రిగేషన్ సినగాగ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు యూదు నివాసితులు మరణించిన ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా బహిరంగ విచారణకు (Public Inquiry) ఆదేశించింది. అక్టోబర్ 2025లో యోమ్ కిప్పూర్ ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని బ్రిటన్ హోం మంత్రి శబానా మహమూద్ సోమవారం పార్లమెంటులో ప్రకటించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పరిశీలించడంతో పాటు అన్ని రకాల సాక్ష్యాధారాలను పారదర్శకంగా సేకరించేందుకు ఈ బహిరంగ విచారణ ఎంతగానో తోడ్పడుతుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ దాడిలో ఏడ్రియన్ డాల్బీ మరియు మెల్విన్ క్రేవిట్జ్ అనే ఇద్దరు యూదు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, దాడికి పాల్పడిన ఐసిస్ (Islamic State) సానుభూతిపరుడు జిహాద్ అల్-షామీని పోలీసులు ఘటనా స్థలంలోనే కాల్చిచంపారు. సాధారణ మరణాల విచారణ విధానంలో రహస్య లేదా జాతీయ భద్రతా సమాచారాన్ని విచారించే వెసులుబాటు లేకపోవడంతోనే ఈ కేసును బహిరంగ విచారణకు బదిలీ చేయాలని చీఫ్ కారోనర్ విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది.
బ్రిటన్‌లో యూదు వర్గాలపై పెరుగుతున్న ద్వేషపూరిత దాడులు మరియు యాంటీ-సెమిటిజం (Antisemitism) ఘటనలపై బ్రిటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి ఉగ్రవాద దాడుల వెనుక ఉన్న నిఘా లోపాలను గుర్తించడం మరియు భవిష్యత్తులో సినగాగ్‌లు, మైనారిటీ ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేయడమే ఈ విచారణ ముఖ్య ఉద్దేశమని హోం మంత్రి వెల్లడించారు. బాధితుల కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చేందుకు విచారణాధికారులు విసృతంగా విచారించనున్నట్లు బ్రిటన్ సర్కార్ తెలిపింది.