హార్డ్‌వేర్ వ్యాపార రహస్యాల కేసులో యాపిల్‌పై ఓపెన్ఏఐ ఎదురుదాడి
సూర్య అంతర్జాతీయ డెస్క్: హార్డ్‌వేర్ వ్యాపార రహస్యాల చోరీ ఆరోపణలకు సంబంధించి యాపిల్, ఓపెన్ఏఐ సంస్థల మధ్య నడుస్తున్న న్యాయ పోరాటం మరింత ఉద్రిక్తంగా మారింది. కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఓపెన్ఏఐ సంస్థ యాపిల్‌పై ఎదురు దావాలు వేస్తూ, యాపిల్ పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. విడుదల కానున్న ఉత్పత్తులకు సంబంధించిన గోప్యమైన ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకున్నారంటూ ఓపెన్ఏఐ, దాని హార్డ్‌వేర్ విభాగమైన ఐఓ ప్రొడక్ట్స్ ఇంక్, మరో ఇద్దరు మాజీ యాపిల్ ఉద్యోగులపై జూలైలో యాపిల్ సంస్థ నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు దాఖలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. మాజీ ఇంజినీర్ చాంగ్ లియు కంపెనీ ల్యాప్‌టాప్‌ను ఉంచుకుని, నెట్‌వర్క్ లోపాన్ని ఆసరాగా చేసుకుని గోప్య సమాచారాన్ని డౌన్‌లోడ్ చేశారని యాపిల్ ఆరోపించింది. అలాగే తయారీ పద్ధతులు, సరఫరాదారులతో సంబంధాలను పొందేందుకు ఐఓ ప్రొడక్ట్స్ ద్వారా ఓపెన్ఏఐ సమన్వయంతో వ్యవహరించిందని పేర్కొంటూ నష్టపరిహారం, జ్యూరీ విచారణ, అక్రమంగా పొందిన సమాచారాన్ని వాడకుండా నిరోధించే కోర్టు ఉత్తర్వులు కోరింది.
సాఫ్ట్‌వేర్ పరిమితులను దాటి హార్డ్‌వేర్ రంగంలోకి విస్తరించేందుకు మాజీ యాపిల్ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్, మాజీ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ సహ-వ్యవస్థాపకులుగా ఉన్న ఐఓ ప్రొడక్ట్స్ స్టార్టప్‌ను ఓపెన్ఏఐ దాదాపు 6.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఓపెన్ఏఐలో 400 మందికి పైగా మాజీ యాపిల్ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ, దావాలో ఇద్దరిని మాత్రమే ప్రతివాదులుగా చేర్చారు. యాపిల్ ఆరోపణలను ఓపెన్ఏఐ, ఆ ఉద్యోగులు ఖండించారు. లియు రాజీనామా చేసిన తర్వాత ఆయన వ్యక్తిగత సందేశాలను అనధికారికంగా పర్యవేక్షించడంపైనే యాపిల్ కేసు ఆధారపడి ఉందని వారు పేర్కొన్నారు.
ఓపెన్ఏఐ ఆరు నెలల పాటు పనిచేసి, కొత్త పరికరం వివరాలు, హార్డ్‌వేర్ రోడ్‌మ్యాప్‌ను పరిశీలించిన మాజీ ఉద్యోగిని యాపిల్ తిరిగి విధుల్లోకి తీసుకుందని ఓపెన్ఏఐ ఎదురు ఆరోపణ చేసింది. ఆ పత్రాలను చేజిక్కించుకోవడానికే యాపిల్ ఈ చర్యలు తీసుకుంటోందని ఆరోపించింది. అంతేకాకుండా, భవిష్యత్తులో వచ్చే ఓపెన్ఏఐ పరికరాలకు దూరంగా ఉండాలని సరఫరాదారులపై యాపిల్ ఒత్తిడి తెస్తోందని, ఉద్యోగ నిబంధనలను కంపెనీ పరికరాలు, ఖాతాలతో ముడిపెడుతోందని ఓపెన్ఏఐ ఆరోపించింది. అయితే, తమ కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే ఓపెన్ఏఐ ఈ రెండు ఆరోపణలు చేస్తోందని యాపిల్ ఖండించింది.