గ్లోబల్ ఔటేజ్‌తో స్తంభించిన మైక్రోసాఫ్ట్ 365, టీమ్స్, ఔట్‌లుక్ సేవలు: వినియోగదారులకు క్షమాపణలు తెలిపిన సంస్థ
సూర్య గ్లోబల్ & టెక్ డెస్క్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో తలెత్తిన భారీ సాంకేతిక అంతరాయం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు, ఐటీ మరియు కార్పొరేట్ సంస్థలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మైక్రోసాఫ్ట్ 365 సూట్‌లోని అత్యంత కీలకమైన ఔట్‌లుక్ , మైక్రోసాఫ్ట్ టీమ్స్ , ఏఐ అసిస్టెంట్ కోపైలట్ సహా పలు క్లౌడ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో కార్యాలయ పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఈ పరిణామంపై స్పందించిన మైక్రోసాఫ్ట్, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ "డీప్లీ సారీ" అని క్షమాపణలు తెలిపింది.
అసలేం జరిగింది? ఏయే సేవలపై ప్రభావం పడింది?:
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వినియోగదారులు తమ ఔట్‌లుక్ ఖాతాలకు లాగిన్ కాలేకపోతున్నామని, ఈమెయిల్స్ పంపడం లేదా స్వీకరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కార్పొరేట్ సమావేశాలకు కీలకమైన మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో మెసేజ్‌లు వెళ్లకపోవడం, ఆడియో-వీడియో కాల్స్ కనెక్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. వీటితో పాటు వర్డ్, ఎక్సెల్ మరియు ఎడ్జ్ బ్రౌజర్‌లలో అనుసంధానమై ఉన్న 'కోపైలట్' ఏఐ సేవలు కూడా పనిచేయడం ఆగిపోయింది. డౌన్‌డిటెక్టర్ వంటి అంతరాయాలను పర్యవేక్షించే ప్లాట్‌ఫామ్‌లలో వేలాది మంది యూజర్లు ఒకేసారి ఫిర్యాదులు నమోదు చేయడంతో ఈ ఔటేజ్ తీవ్రత వెలుగులోకి వచ్చింది.
మైక్రోసాఫ్ట్ స్పందన & పునరుద్ధరణ చర్యలు:
సమస్య తలెత్తిన వెంటనే రంగంలోకి దిగిన మైక్రోసాఫ్ట్ ఇంజనీరింగ్ బృందం, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలలో జరిగిన ఒక కీలక మార్పు వల్లే ఈ అంతరాయం ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించింది. ప్రభావితమైన ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ ఆరోగ్యకరమైన సర్వర్ల వైపు మళ్లించడం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని సంస్థ తెలిపింది. సేవల పునరుద్ధరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, త్వరలోనే అన్ని సేవలు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వస్తాయని మైక్రోసాఫ్ట్ తన అధికారిక స్టేటస్ పేజీ మరియు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం పడింది.
2