దక్షిణ కొరియాతో ఏర్పడిన దౌత్యపరమైన అపార్ధాలను తొలగిస్తాం
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల బదిలీ అంశానికి సంబంధించి దక్షిణ కొరియాతో తలెత్తిన వివాదాన్ని కేవలం ఒక దౌత్యపరమైన అపార్ధంగానే భావిస్తున్నామని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించి, సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా వెల్లడించారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొ్లాదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ, రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని బందీలుగా చిక్కిన ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను దక్షిణ కొరియాకు పంపినట్లు బహిరంగంగా వెల్లడించారు. ఈ ప్రకటన సియోల్ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
భద్రతా కారణాలు మరియు దౌత్యపరమైన సున్నితమైన అంశాలరీత్యా ఈ ఖైదీల బదిలీని అత్యంత గోప్యంగా ఉంచాలని దక్షిణ కొరియా భావించింది. అయితే ఉక్రెయిన్ దీనిని బహిరంగపరచడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, ఈ విషయంలో ఉక్రెయిన్ ప్రభుత్వం తమకు అధికారిక వివరణతో పాటు క్షమాపణ చెప్పాలని దక్షిణ కొరియా అధ్యక్ష భవనం డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ గోప్యతా ఒప్పందాన్ని ఉక్రెయిన్ తోసిపుచ్చడం మరింత ఆగ్రహానికి దారితీసింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి, దీనిని పెద్ద సంఘటనగా కాకుండా ఒక చిన్న దౌత్యపరమైన అపార్ధంగా అభివర్ణించారు.
దక్షిణ కొరియాతో తమ దేశానికి అత్యంత ప్రాముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, ఈ సమస్యను అతి త్వరలోనే పరిష్కరించుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా వేలాది మంది సైనికులను రష్యాకు మద్దతుగా మోహరిస్తున్న తరుణంలో, ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నందున, త్వరలోనే ఈ వివాదం సద్దుమణుగుతుందని మరియు సహకార సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని దౌత్య వర్గాలు ఆశిస్తున్నాయి.