ఘనంగా ‘చాణక్య’ టీజర్ లాంచ్: ఎస్ఏ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ!
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న ‘చాణక్య’ సినిమాకు సంబంధించిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా ఎస్ఏ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగోను నిర్మాతలు రాజేశ్వర శర్మ కూచి, ఆదిత్య డొక్కర, గోపాల్ దాయిమ మరియు వినోద్ గార్లపాటి ఘనంగా లాంచ్ చేశారు. అలాగే జనపదం జానపదం లోగోను రాజేశ్వర శర్మ, నరసింహ ఆవిష్కరించగా, ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు ఘర్షణ శ్రీనివాస్ తాండవం లోగోను లాంచ్ చేయడం విశేషంగా నిలిచింది. ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రహ్లాదా చార్యులు మరియు నాగరాజు సోమిశెట్టి కలిసి ‘చాణక్య’ టీజర్‌ను లాంఛనంగా విడుదల చేశారు. రాజేశ్వర శర్మ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రంలో వైభవ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మరియు నిర్మాత రాజేశ్వర శర్మ మాట్లాడుతూ, తన వ్యాపారంలో ఆంజనేయస్వామి అలాగే వెంకటేశ్వర స్వామిని ప్రధాన భాగస్వాములుగా భావిస్తానని, దేవుడు తనకోసం ఒక వ్యక్తిని పంపించాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాదా చార్యులు మాట్లాడుతూ, మనం ఏది అనుకున్నా అది భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుందని, ఏ వ్యాపారం చేసినా అది నలుగురికి ఉపయోగపడేలా ఎంతో గొప్పగా చేయాలని తెలిపారు. నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎస్ఏ ప్రొడక్షన్స్ ద్వారా కళాకారులకు గొప్ప అవకాశాలు లభిస్తాయని, నటీనటుల ప్రతిభను వెలికితీసేందుకు శర్మ గారు తీసుకున్న ఈ సంకల్పం అభినందనీయమని కొనియాడారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిస్తున్న నాగరాజు సోమిశెట్టి మాట్లాడుతూ, ఈ సినిమా కథాంశం చాలా అద్భుతంగా ఉంటుందని, చిన్న చిత్రంగా ప్రారంభమైనప్పటికీ ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునేలా ఈ మూవీ ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని, చిన్న సినిమాలను ఆదరించే ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం పూర్తిగా అందుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టీజర్ లాంచ్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Also Read: క్రికెట్, ఎనర్జీతో ‘హై’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న బీట్స్!