ఆదర్శ కుటుంబం ట్రైలర్ ఆవిష్కరణ.. కామెడీ, యాక్షన్, సస్పెన్స్ తో ఆకట్టుకుంటున్న వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రం
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ ڈెస్క్: విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ అండ్ ఎంటర్‌టైనింగ్ చిత్రం ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలైంది. గిలిగింతలు పెట్టే హాస్య సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, ఆసక్తికరమైన సస్పెన్స్ డ్రామాతో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. త్రివిక్రమ్ మార్క్ రచన, పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు కథలోని వైవిధ్యం ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకను హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ కళాశాలలో విద్యార్థుల కోలాహలం మధ్య చిత్ర యూనిట్ అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ మల్లారెడ్డి విద్యార్థుల మధ్య వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాలేజ్ లైఫ్ లో ఎన్నో మెమోరీస్ ఉంటాయని, విద్యార్థులు మంచి లక్ష్యాలతో కలలను నిజం చేసుకుంటూ, క్రమశిక్షణ కలిగిన వ్యక్తత్వంతో బయటకు రావాలని ఆకాంక్షించారు. ఈ సినిమాలోని వినోదం, థ్రిల్లింగ్ అంశాలు ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా నచ్చుతాయని, అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆస్వాదించాలని కోరారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమా సాధారణ రొమాంటిక్ కామెడీలా కాకుండా ప్రేక్షకులు ఊహించని సరికొత్త కోణంలో సాగుతుందని వెల్లడించారు. కథలో క్రైమ్ కామెడీ మరియు బ్లాక్ కామెడీ అంశాలను ప్రయత్నించామని, ఇది వెంకటేష్‌తో పాటు తనకు కూడా ఒక నూతన ప్రయోగమని వివరించారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని, త్వరలోనే 7 నుండి 8 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్ లను విడుదల చేయనున్నామని తెలిపారు. కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఊహించని సర్ ప్రైజ్ ఇస్తుందని, వెంకటేష్ మరియు త్రివిక్రమ్ లతో పనిచేయడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా కోసం తాను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నానని, ఈ చిత్రం పక్కా త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ తో కూడిన బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై కుటుంబ ప్రేక్షకులలోనూ, యువతలోనూ విపరీతమైన క్రేజ్ నెలకొంది. దీపావళి పండుగ వారాంతానికి ముందే అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.