నవదీప్ చేతిలో ఆస్తి ఉండి ఉంటే వందల కోట్లకు అధిపతి అయ్యాడు: నటుడు అజయ్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఘోష్ తాజాగా హీరో నవదీప్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నవదీప్ కుటుంబానికి ఒకప్పుడు ఉన్న భారీ ఆస్తులు మరియు రియల్ ఎస్టేట్ నేపథ్యం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒకవేళ ఆ ప్రాపర్టీని వారు అలానే అంటిపెట్టుకుని ఉంటే నేడు నవదీప్ వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు అధిపతి అయి ఉండేవాడని ఆయన పేర్కొనడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అజయ్ ఘోష్ వెల్లడించిన వివరాల ప్రకారం, నవదీప్ తండ్రి రామారావు 2002వ సంవత్సరంలో బాపట్ల జిల్లాలోని చీరాల బీచ్ సమీప ప్రాంతంలో ‘రామాపురం రిసార్ట్స్’ పేరుతో ఒక వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ రిసార్ట్స్‌ను, ఆ కుటుంబం పూర్తిగా హైదరాబాద్‌కు తరలిరావాల్సి రావడంతో అనివార్య పరిస్థితుల్లో అమ్మేశారు. అయితే కాలక్రమేణా ఆ తీర ప్రాంతం పర్యాటకంగా భారీగా విస్తరించడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పుంజుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతం ‘ఆంధ్రా గోవా’గా విశేష గుర్తింపు పొందడంతో అక్కడ భూముల ధరలు అంబంటాక తాకాయి.
ఆనాడు వారు అమ్మేసిన ఆ ప్రాపర్టీ విలువ ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం సుమారు రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని అజయ్ ఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాన్ని చూసినప్పుడల్లా అంత పెద్ద ఆస్తి నవదీప్ చేజారిపోయిందే అని తనకు ఎప్పుడూ బాధనిపిస్తుంటుందని ఆయన పేర్కొన్నారు. కాలం ఎవరిని ఏ సమయంలో ఏ విధంగా మారుస్తుందో చెప్పలేమనేందుకు ఇది ఒక ఉదాహరణ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నవదీప్‌కు సంబంధించిన ఈ పాత విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి.