విశాఖలో ఆధునిక దంత వైద్య విప్లవానికి నాంది!
విశాఖపట్నం, సూర్య : విశాఖపట్నం వైద్య రంగంలో మరో ఆధునిక వైద్య కేంద్రం అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన వైద్య పరికరాలు, సమగ్ర దంత చికిత్సా సదుపాయాలతో అక్కయ్యపాలెంలో ఏర్పాటు చేసిన ‘శ్రీ షిర్డీ సాయి 4డి డెంటల్ లాంజ్’ ఐదవ శాఖ గురువారం ఘనంగా ప్రారంభమైంది. రిటైర్డ్ డీఎంహెచ్ఓ డాక్టర్ డి. సుధాకర్ పట్నాయక్, ప్రముఖ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ అనూష డబ్బిరు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం మెయిన్ రోడ్డులో ఎరుకుమాంబ దేవాలయం సమీపంలో, మయూర స్వీట్స్ పక్కన ఏర్పాటు చేసిన ఈ ఆధునిక దంత వైద్య కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.ఎస్. నాయుడు మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య రంగంలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ డి. సుధాకర్ పట్నాయక్ కుటుంబం దంత వైద్య రంగంలో చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆధునిక వైద్య సాంకేతికతను ప్రజలకు చేరువ చేస్తూ, అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని అన్నారు.
ప్రస్తుతం దంత వైద్య విభాగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాధాన్యత, డిమాండ్ పెరుగుతున్నాయని, దంత ఆరోగ్యం అనేది వ్యక్తిగత ఆరోగ్యంలో కీలకమైన భాగమని పేర్కొన్నారు. కాస్మోపాలిటన్ నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో అత్యాధునిక పరికరాలతో ప్రారంభమైన ఈ డెంటల్ లాంజ్ భవిష్యత్తులో నగరంలోనే ప్రముఖ దంత వైద్య కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు విస్తృత వైద్య సేవలు అందించాలని అభిలాషించారు. ఈ ఆసుపత్రిని తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య పరికరాలు, సమగ్ర చికిత్సా సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ డెంటల్ లాంజ్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. దంత సంబంధిత సమస్యలకు మెరుగైన చికిత్స అందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఈ కేంద్రం విశేష పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మరో గౌరవ అతిథి ఒరిస్సా స్టీవ్ డోర్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జె.కె. నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు వైద్య సంస్థలు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి ఆధునిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
డాక్టర్ డి. సుధాకర్ పట్నాయక్ మాట్లాడుతూ, తన కుమార్తె ప్రముఖ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ అనూష డబ్బిరు 2012లో 4డి డెంటల్ వైద్య సేవలను ప్రారంభించారని తెలిపారు. తన కుమారుడు డాక్టర్ అజిత్ కుమార్ డబ్బిరు సహకారంతో విశాఖ నగరంలో ఇప్పటికే నాలుగు శాఖలను విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం అక్కయ్యపాలెంలో ఐదవ శాఖగా ఈ నూతన డెంటల్ లాంజ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. తమ సంస్థ ద్వారా వైద్యులు, వైద్య సిబ్బందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన దంత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధిత ఎంప్యానెల్మెంట్ నిబంధనల ప్రకారం నగదు రహిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోలీస్, ఎక్సైజ్, రైల్వే, ఈఎస్ఐ, ఈహెచ్ఎస్, సీజీహెచ్ఎస్, ఎన్డీవీ, ఎంఈఎస్, నావల్ బేస్ తదితర విభాగాల ఉద్యోగులకు ఈ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమానికి విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వి. మన్మధరావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ పృథ్వీరాజ్ అంబటి, శ్రీమతి సుజాత తదితరులు పాల్గొన్నారు. అత్యవసర విధుల నిర్వహణ కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన విశాఖ నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ అన్నేపు నరసింహమూర్తి నూతన దంత వైద్య కేంద్రం విజయవంతంగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.