వీరన్నపాలెం గ్రామంలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్, పోలీసుల ఫ్లాగ్ మార్చ్
పర్చూరు, మేజర్‌న్యూస్ :
బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్టూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. నాగభూషణం గారి ఆధ్వర్యంలో ఈరోజు పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలోని కొత్తపల్లె ప్రాంతంలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసు సిబ్బంది గ్రామంలోని ఇళ్లను, పరిసర ప్రాంతాలను తనిఖీ చేయడంతో పాటు వాహనాలను మరియు వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో మార్టూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. నాగభూషణం గారు, పర్చూరు ఎస్‌ఐ శ్రీ పి. అంకమ్మరావు గారు, యద్దనపూడి ఎస్‌ఐ శ్రీమతి డి. రత్నకుమారి గారు మరియు 15 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మార్టూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. నాగభూషణం గారి నేతృత్వంలో, పర్చూరు ఎస్‌ఐ శ్రీ పి. అంకమ్మరావు, యద్దనపూడి ఎస్‌ఐ శ్రీమతి డి. రత్నకుమారి మరియు పోలీసు సిబ్బందితో కలిసి వీరన్నపాలెం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు భద్రతాభావం కల్పించడం, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలియజేయడం ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశ్యం. ఈ సందర్భంగా మార్టూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గ్రామ ప్రజలతో మాట్లాడి, రాబోయే MPTC, ZPTC ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఎన్నికల కారణంగా ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడకూడదని, పరస్పరం స్నేహపూర్వకంగా ఉండాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు లేదా చట్టవ్యతిరేక చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.