వసతి గృహాల్లో వైద్యాధికారి తనిఖీలు
విద్యార్థులకు సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన..
పొదలకూరు, మేజర్ న్యూస్:
పొదలకూరు మండలం మహమ్మదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మహమ్మదాపురం గ్రామంలోని బీసీ–1, బీసీ–2, ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహాలను మంగళవారం వైద్యాధికారిణి డాక్టర్ వి. శ్రీకావ్య సందర్శించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని గదులు, పరిసరాలు, వంటగది, స్నానపు గదులు, మరుగుదొడ్లను వైద్యాధికారి పరిశీలించారు. వసతి గృహాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచాలని వార్డెన్‌కు సూచించారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సీజనల్ వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అవసరమైన విద్యార్థులకు మందులు అందజేశారు. వసతి గృహాల్లో తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు నీటి నమూనాలను సేకరించారు. విద్యార్థులు సురక్షితమైన తాగునీటిని మాత్రమే వినియోగించాలని, ముఖ్యంగా ఆర్వో నీటిని తాగాలని వైద్యాధికారి సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ ఎస్‌కే. ముస్తఫా, ఆరోగ్య సహాయకుడు టి. పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.