BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం..

Select Suryaa Now
ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర తీరం వైపు వేగంగా కదులుతోంది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వ్యవస్థ బుధవారం రాత్రి ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ వెల్లడించింది. ప్రస్తుతం ఇది కళింగపట్నానికి సుమారు 60 కిలోమీటర్ల ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 140 కిలోమీటర్ల తూర్పు-ఈశాన్యంగా, గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలిన ఈ వాయుగుండం.. రాత్రికి విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య, కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
తీరానికి చేరువలో.. అప్రమత్తమైన యంత్రాంగం
తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 30–35 నాటికల్ మైళ్ల వేగంతో గాలులు, గరిష్ఠంగా 40 నాటికల్ మైళ్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాల అవకాశాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది.
గోదావరి జిల్లాల్లో దంచికొడుతున్న వానలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.రాజమహేంద్రవరం నగరంలో భారీ వర్షం కురవడంతో రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్యామలా సెంటర్, హైటెక్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది. రహదారులు చెరువులను తలపించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జిల్లాలోని గోపాలపురంలో 89 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. దేవరపల్లిలో 75.2, నల్లజర్లలో 69, అనపర్తిలో 65.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సీతానగరం, కడియం, చాగల్లు తదితర మండలాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. ఏపీ ప్రభుత్వ వాతావరణ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 23న శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అనేక మండలాల్లో 10 మి.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది.
అల్లూరిలో వాగులు ఉద్ధృతం.. జలపాతాల వద్ద నో ఎంట్రీ
అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. పాడేరు, అరకు లోయ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.భారీ వర్షాల నేపథ్యంలో జలపాతాల వద్ద ప్రమాదాలను నివారించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. చాపరాయి జలపాతాన్ని మూసివేయడంతో పాటు పలు పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
రంపచోడవరంలో 24 గంటల కంట్రోల్ రూమ్
భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరికల నేపథ్యంలో రంపచోడవరం ఆర్డీవో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులు కేటాయించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వర్షాలు, వరదలు, పిడుగులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అధికారులకు తెలియజేయాలని సూచించారు.

శ్రీకాకుళంలో రెండ్రోజులుగా వానలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆమదాలవలస, బూర్జ, పొందూరు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోకి కూడా వర్షపు నీరు చేరింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షాలు పంటలకు ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు.
విశాఖలో చెట్టు నేలకూలి.. వాహనంపై
తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నంలోనూ గత రెండు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. లాసెన్స్ బే కాలనీలో భారీ వృక్షం నేలకూలి అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనంపై పడింది. చెట్టు కూలడంతో విద్యుత్ తీగలు దెబ్బతినడంతో అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం చెట్టును తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.


తీరం దాటే వేళ మరింత అప్రమత్తత
భారత వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం ఈ వ్యవస్థ బుధవారం రాత్రి ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని, విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండంగానే దాటే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు, సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.