టీడీపీ vs టీడీపీ..కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
నందలూరు / కడప:కడప జిల్లా నందలూరులో నామినేషన్ల పర్వం హింసాత్మకంగా మారింది. నామినేషన్ల విషయంలో టీడీపీ నేతల మధ్య చెలరేగిన వివాదం ఒక్కసారిగా తారాస్థాయికి చేరి, కాల్పుల కలకలానికి దారితీసింది.
నామినేషన్ వేసేందుకు మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గం అభ్యర్థి రావడంతో వివాదం మొదలైంది. టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు రావడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటడంతో టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గాల్లోకి కాల్పులు జరిపారు.
అంతటితో ఆగకుండా మేడా విజయశేఖర్‌రెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆయనకు చెందిన కారును పూర్తిగా తగలబెట్టారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు, కుర్చీలు విసురుకోవడంతో నందలూరులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ హింసాత్మక ఘటనతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.