రూ.31 కోట్లతో చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చిత్తూరు రైల్వే స్టేషన్‌ను సుమారు రూ.31 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు గుంతకల్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని కలిగించేలా స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా పార్కింగ్, పారిశుద్ధ్యం, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబీలు), ఏసీ వెయిటింగ్ హాళ్లు, రిటైరింగ్ రూములు, లాంజ్‌లు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన సంవాద్ కార్యక్రమంలో భాగంగా ప్రయాణికుల సమస్యలు, అవసరాలు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు చిత్తూరు రైల్వే స్టేషన్‌ను సందర్శించినట్లు గుంతకల్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం చిత్తూరు రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ప్రయాణికులు, ప్యాసింజర్ అసోసియేషన్ ప్రతినిధులు, జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుద్ధ్యం, పార్కింగ్, ఇతర మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడమే జన సంవాద్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చిత్తూరు ప్రాంత ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు తెలియజేసిన అభ్యర్థనలను డివిజనల్, జోనల్ స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత వరకు అమలయ్యేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.