స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ కసరత్తు వత్సవాయి మండలంలో ఆశావహులతో సమావేశం
వత్సవాయి, అక్టోబర్ 17:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వత్సవాయి మండలంలో వైఎస్సార్సీపీ ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆదేశాల మేరకు శనివారం వత్సవాయి మండల కేంద్రంలో మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న ఆశావహుల గురించి నాయకులు చర్చించారు. ఆయా గ్రామాల్లో పార్టీ పరిస్థితి, నాయకుల బలాబలాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ, పోటీకి ఆసక్తి చూపుతున్న వారి వివరాలపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది.మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులు చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ముందస్తు కసరత్తులో భాగంగానే ఈ సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్లో ప్రకటించారు.