స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి!
ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లాలి - రామారావు
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు ఏ. రామారావు పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ క్యాడర్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, జనసైనికులు తమ పరిధిలోని ఓటర్ల జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఏ. రామారావు సూచించారు. పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకునేలా క్షేత్రస్థాయిలో పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని నాయకులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు రామాజీ ప్రసాద్, మంచాల సంజీవ్, మాదాసు మురళి, సుంకర మురళి, పి.ఓ.సి. కల్యాణ్ రెడ్డి, సేగిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి, మంచి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.