ఇసుక ర్యాంపు ఏర్పాటుకు ప్రజా అభిప్రాయ సేకరణ
ఇసుక ర్యాంపు ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ
వశిష్ట గోదావరిలో తీపర్రు వద్ద రెండు ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణకు సెప్టెంబర్ 24వ తేదీ గురువారం పెరవలి మండలం తీపర్రు గ్రామ సచివాలయం వద్ద గ్రామసభ ఏర్పాటు చేశారు. ఏ ఓపెన్ రీచ్ లో 8.884 హెక్టార్ల లోను, బి ఓపెన్ రీచ్ లో 16.286 హెక్టార్లలోను ఇసుకతవకాలకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. దీనిపై ప్రజల అభిప్రాయాలు అభ్యంతరాలు తెలుసుకునేందుకు తీపర్రు సచివాలయంలో గురువారం మధ్యాహ్నం గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రత్తిపాటి ప్రసాద్ కుమార్, మొగళ్ళపు సీతారాం,కరటూరి గోపాలకృష్ణ తదితరులు హాజరై తమ అభిప్రాయాలు సభకు తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో విపరీతంగా ఇసుక తవ్వి తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, లంక భూములు కోతకు గురవుతున్నాయని అధికారులు దృష్టికి తెచ్చారు. గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా ర్యాంపు ఏర్పాటు చేయాలని కోరారు. తీపర్రు గ్రామ పరిధిలో ఇసుక ర్యాంపులు నిర్వహించడం వల్ల గ్రామానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తీపర్రుకు చెందిన అనేకమంది ప్రముఖులు, ప్రజానీకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుంకవెల్లి శ్రీహరి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎక్కడ ఇసుక ర్యాంపు ఏర్పాటు చేయకపోవడం వల్ల గ్రామస్తులు ఇసుక కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని గ్రామ వినియోగం కోసం ఇక్కడ ఇసుక తీసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు, పొల్యూషన్ బోర్డ్ ఈఈ సూర్య కళ, మైన్స్ ఏడి ఫణి భూషణ్ రెడ్డి, తాసిల్దార్ నిరంజన్ ఇతర అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.