రైతు సంక్షేమమే ధ్యేయం
నిబంధనల ప్రకారం పారదర్శక సేవలు అందిస్తాం
మోమిన్‌పేట్ పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్( సెప్టెంబర్ 24):
రైతుల సంక్షేమమే ధ్యేయంగా మోమిన్‌పేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని నూతన చైర్మన్ ఎన్. నరోత్తం రెడ్డి అన్నారు. గురువారం మోమిన్‌పేట్ పీఏసీఎస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై. మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ శేఖర్ ఆధ్వర్యంలో చైర్మన్‌గా ఎన్. నరోత్తం రెడ్డి, వైస్ చైర్మన్‌గా పి. మల్లారెడ్డితో పాటు నూతన డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎన్. నరోత్తం రెడ్డి మాట్లాడుతూ.. గతంలో చీమలదరి సర్పంచ్‌గా, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంపై తనకు అవగాహన ఉందని తెలిపారు. ఈ అనుభవంతో మోమిన్‌పేట్ పీఏసీఎస్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోమిన్‌పేట్ పీఏసీఎస్‌ను జిల్లాలోనే ఆదర్శవంతమైన సహకార సంఘంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.సాగు సీజన్‌లో రైతులకు ఎరువులు, పురుగు మందులు, రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అవసరమైన నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు రుణాలను వేగంగా మంజూరు చేసి సకాలంలో అందించడంతో పాటు తక్కువ వడ్డీతో బంగారు రుణాలను అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు.అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను నాయకులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ మాణిక్య చారి