రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు రైతుల నమోదు కీలకం: డీఏఓ చంద్రకళ
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24):వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు రైతులకు నేరుగా అందాలంటే వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో సక్రమంగా నమోదు కావడం అత్యంత కీలకమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ అధికారిణి కె. చంద్రకళ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.ఈ నేపథ్యంలో జిల్లాలోని అర్హులైన ప్రతి రైతు ఆలస్యం చేయకుండా వెంటనే రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు.
*జిల్లాలో 52.53 శాతం నమోదు పూర్తి:
జిల్లావ్యాప్తంగా రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని డీఏఓ తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 54,665 మంది రైతులకు గాను ఇప్పటివరకు 28,718 మంది (52.53 శాతం) రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని వివరించారు. మిగిలిన రైతులందరూ త్వరితగతిన తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.
*ఈ నెల 30 చివరి తేదీ:
రైతులు తమ సమీపంలోని ఏఈఓ, మీ-సేవ లేదా సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.ఈ నమోదుకు ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పట్టాదారు పాస్‌బుక్ వివరాలు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ అవసరమవుతాయని పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ధ్రువీకరణ ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. రైతులందరూ అవసరమైన ఆధారాలతో వచ్చి ఈ నెల 30వ తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి కె.చంద్ర కళ కోరారు.రిపోర్టర్ బాల్ రెడ్డి