సంక్షేమ పథకాల అమలుపై మంత్రి డోలా సమీక్ష
ఏపీ సూర్య స్టేట్ బ్యూరో ,అమరావతి:
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సాంఘిక సంక్షేమ శాఖ, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదివారం తిరుపతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు సమావేశానికి హాజరై జిల్లాల వారీగా సంక్షేమ కార్యక్రమాల అమలు, లబ్ధిదారులకు అందుతున్న సేవలు, ప్రభుత్వ పథకాల పురోగతిని మంత్రికి వివరించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ సేవలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.