శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం: పులివెందుల ఘటనలపై మంత్రి లోకేష్ ఆగ్రహం!
అమరావతి:స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పులివెందులలో చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలకు, శాంతిభద్రతల సమస్యలకు పూర్తిగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
పులివెందులలో జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. "గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో పులివెందులలో స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. అప్పట్లో అసలు పోటీయే లేకుండా అవి ఎలా ఏకగ్రీవమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలి" అని నిలదీశారు. అప్పట్లో ప్రతిపక్షాల హక్కులను అణచివేసి ఏకగ్రీవాలు చేసుకున్న జగన్, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా సాగుతుంటే.. ఒక్క పులివెందులలోనే వైఎస్సార్‌సీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే జగన్ నాటకాలు ఆడుతున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని లోకేష్ విమర్శించారు. ఓటర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.