ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దంపతులు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం 11వ వార్డు పరిధిలోని రైల్వే పైవంతెన వద్ద ఉన్న బాపు బాల భవన్ పోలింగ్ కేంద్రంలో తన సతీమణి కంచెర్ల ప్రతిమతో కలిసి ఓటు వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల అధికారులు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనకు మద్దతుగా ఉన్నారని, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి మెండుగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు నగర ప్రజల ఆదరణ, ఆశీస్సులతో కూటమి మేయర్ అభ్యర్థి కఠారి హేమలత భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్