ప్రభుత్వ ఉద్యోగులారా!
నో పాలిటిక్స్.. నో ప్రచారం!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ 'ప్రభుత్వ ఉద్యోగులకు' ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు - సీఈసీ హెచ్చరిక
ఎస్. రాయవరం, అక్టోబర్ 12, మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, పబ్లిక్ సర్వెంట్లు పూర్తి రాజకీయ తటస్థత పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది.
"ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలి"
అని ఆ ప్రకటనలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్ వంటి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. సందేహాల కోసం 1950 వోటర్ హెల్ప్ లైన్, eci.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.
ప్రధాన నిబంధనలు ఇవే...
రాజకీయ తటస్థత, ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు. ఉద్యోగులు ఎలాంటి పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలి. ఏ పార్టీ తరపున ప్రచారం చేయరాదు. ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ప్రభుత్వ వనరుల వాడకంపై నిషేధం. ముఖ్యంగా, ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వాహనాలు, భవనాలు, పాఠశాలలు, యంత్రాంగం, నిధులు, అతిథి గృహాలను ఏ రాజకీయ పార్టీకి లేదా మంత్రికి కేటాయించకూడదు. స్వయంగా వాడకూడదు. ప్రభుత్వ నిధులతో అధికార పార్టీ విజయాలను కీర్తిస్తూ ప్రకటనలు జారీ చేయరాదు.
కొత్త పథకాలు, శంకుస్థాపనలపై బ్రేక్!
కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం, శంకుస్థాపనలు చేయడం, కొత్త పథకాలు ప్రారంభించడం, మంత్రులు, నాయకులకు సహకరించడం పూర్తిగా నిషేధం. పర్యటనలు, బదిలీలు, సెలవులపై ఆంక్షలు తప్పనిసరి. మంత్రులు అధికారిక పర్యటనలను ఎన్నికల ప్రచారంతో ముడిపెడితే ఉద్యోగులు వారి వెంట వెళ్లరాదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కలెక్టర్ లేదా రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ఎలాంటి సెలవులు మంజూరు చేయరు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల బదిలీలపై పూర్తి నిషేధం. అత్యవసరమైతే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి.
పోలింగ్ రోజు జాగ్రత్తలు:
పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఓటర్లను ప్రభావితం చేయరాదు. ఏజెంట్లకు ఇచ్చే ఐడెంటిటీ స్లిప్పులు కేవలం తెల్ల కాగితంపై మాత్రమే ఉండాలి, వాటిపై పార్టీ గుర్తులు, అభ్యర్థుల పేర్లు ఉండరాదు. నగదు, బహుమతులపై నిఘా ఉంటుంది. పరిమితికి మించి నగదు, బంగారం, వెండి, గిఫ్ట్ వస్తువులు తీసుకువెళ్లడం నిషేధం. చివరగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉన్నతాధికారులకు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ స్క్వాడ్ లకు ప్రభుత్వ సిబ్బంది పూర్తిగా సహకరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.