ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
అనంతపురం బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్ డిమాండ్ చేశారు. తపోవనం ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు, విద్యానగర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఆటస్థలం కేటాయించాలని ఆయన కోరారు.
అనంతపురం రూరల్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఎస్ఎఫ్ఐ నాయకులు పరిశీలించి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ‘స్కూల్ బచావో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను గుర్తించినట్లు తెలిపారు.
విద్యానగర్ జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరమేష్ పేర్కొన్నారు. పాఠశాలలో ఆటలు ఆడుకోవడానికి తగిన ఆటస్థలం కూడా లేకపోవడం వల్ల విద్యార్థులకు శారీరక వ్యాయామం, క్రీడా కార్యకలాపాలకు అవకాశం తగ్గుతోందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, అందుకు తగిన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా తపోవనం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే అవసరమైన భవనాలు, తరగతి గదులు, ఆటస్థలాలు వంటి కనీస సదుపాయాలను సమకూర్చాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పరమేష్ కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.