నిల్వ నీటిని తొలగిద్దాం. దోమల వ్యాప్తిని అరికడదాం
నిల్వ నీటిని తొలగిద్దాం – దోమల వ్యాప్తిని అరికడదాం
— పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ సాధ్యం
— సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య
పులివెందుల మేజర్ న్యూస్ :
పులివెందుల మండలం పరిధిలోని కణంపల్లె గ్రామంలో సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది గురువారం ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని క్షుణ్ణంగా పరిశీలించి, దోమల లార్వా ఉన్న ప్రాంతాల్లో అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య మాట్లాడుతూ.. ప్రజలు తమ నివాసాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో మురుగు కాలువలు సక్రమంగా పారేలా చూసుకోవాలని, ఇళ్ల ముందు చెత్తాచెదారం పేరుకుపోకుండా నిరంతరం శుభ్రపరుచుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి ప్రాణాంతక విషజ్వరాలు దరిచేరకుండా ఉంటాయని స్పష్టం చేశారు.
ముఖ్యంగా నిల్వ ఉన్న నీటిలోనే దోమల లార్వా వేగంగా వృద్ధి చెందుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం తప్పనిసరిగా 'డ్రై డే'గా పాటించి ఇళ్లను, పరిసరాలను పొడిగా ఉంచుకోవాలని తెలిపారు. నీటి తొట్టెలు, ఎయిర్ కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ వ్యర్థాలలో వర్షపు నీరు చేరకుండా ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రం చేసుకోవాలన్నారు.
దోమల నివారణ, పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఎవరికైనా జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త గోపాల్ నాయక్, ఆశా కార్యకర్త శ్రీమతి అంజినమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.