పిసి మరియు పి ఎన్ డి టి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్. కాజా మొనిద్దీన్
*పి.సి & పి.ఎన్.డి.టి చట్టంపై సబ్ డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం*
*ఆడ శిశువుల రక్షణకు పి.సి & పి.ఎన్.డి.టి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి*
– డాక్టర్ ఎస్. ఖాజా మొనుద్దీన్
పులివెందుల, మేజర్ న్యూస్ :
పి.సి & పి.ఎన్.డి.టి గర్భధారణ పూర్వ మరియు ప్రసవ పూర్వ నిర్ధారణ పద్ధతులు చట్టం అమలుపై పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. ఖాజా మొనుద్దీన్ ఆధ్వర్యంలో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత మాట్లాడుతూ, గర్భంలో శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. సమాజంలో ఆడ శిశువుల పట్ల వివక్ష తొలగించి, బాలికల జననాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు చట్టంపై అవగాహన కల్పించడం వైద్యుల బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్.ఎం.ఓ డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, పి.సి & పి.ఎన్.డి.టి చట్టం ఉద్దేశ్యం లింగ వివక్షను అరికట్టి బాలికల జనన నిష్పత్తిని మెరుగుపరచడమేనని చెప్పారు. స్కానింగ్ కేంద్రాలు, వైద్య సంస్థలు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. ఖాజా మొనుద్దీన్ మాట్లాడుతూ, గర్భంలో శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందన్నారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లల సంరక్షణ, విద్య, అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భాకరాపురం, నాగరిగుట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ శాంతికుమార్, డాక్టర్ స్నేహ ప్రత్యుష తమ పరిధిలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు చట్టంపై అవగాహన కల్పిస్తూ, బాలికల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు మొమ్మెల రాజు మాట్లాడుతూ, సమాజంలో బాలికల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించేందుకు స్వచ్ఛంద సంస్థలు, వైద్యశాఖ, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో సేవాసమితి ఎల్లప్పుడూ భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, కమిటీ సభ్యులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.