మైనార్టీ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం ఎమ్మెల్యే బీవీ
ముస్లిం మైనారిటీ కాలనీల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బీవీ సమీక్ష
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ ప్రతినిధులు, మసీదులు, ఈద్గా కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జామియా మసీదు, మైనారిటీ కాలనీ మసీదు, కర్నూలు బైపాస్ రోడ్డులోని షహీద్‌ఖానా, ఉర్దూఘర్‌కు కనెక్టివిటీ రోడ్డు, కబరస్తాన్‌కు కాంపౌండ్ వాల్, నీటి సౌకర్యం, సోమగూరు రోడ్డులోని కమ్యూనిటీ స్థలానికి కాంపౌండ్ వాల్ తదితర అభివృద్ధి పనులపై చర్చించారు.
కమ్యూనిటీ ప్రతినిధులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులు, కమిటీ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే జామియా మసీదు, మైనారిటీ కాలనీ మసీదు, ఉర్దూఘర్, షహీద్‌ఖానా తదితర ప్రాంతాలను స్వయంగా సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు.
కమ్యూనిటీ కమిటీల సహకారంతో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, వివిధ మసీదుల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, టీడీపీ పట్టణ మైనారిటీ నాయకులు, ముస్లిం కమ్యూనిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.