మండల పరిషత్ పాలకవర్గం కి ఘన సన్మానం
ఎమ్మిగనూరు మండల పరిషత్ పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు మండల పరిషత్ పాలకవర్గంలో ప్రజాప్రతినిధులుగా సేవలందించిన వారికి పదవీకాలం ముగిసిన సందర్భంగా బుధవారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సీఈసీ సభ్యులు ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగింది.
ముందుగా ఎంపీపీలు, జడ్పీటీసీ, మాజీ ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు చెన్నకేశవ రెడ్డి స్వగృహానికి చేరుకుని ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు బనవాసి బసి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చెన్నకేశవ రెడ్డి సేవలు అభినందనీయం:
ఎంపీపీ గొల్ల కేశన్న మాట్లాడుతూ, రాజకీయ అనుభవం లేని తనకు అవకాశం కల్పించి నాయకుడిగా తీర్చిదిద్దిన చెన్నకేశవ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. మండలంలోని గ్రామాలను సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని అభివృద్ధి పనులకు కృషి చేశారని తెలిపారు. ఆయన నాయకత్వంలో రోడ్లు, సచివాలయ భవనాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్ల వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు.
ప్రజాసేవకు పదవులతో సంబంధం లేదు
బనవాసి బసి రెడ్డి మాట్లాడుతూ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పదవీకాలంలో అందించిన సేవలను అభినందించారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలతో ఏర్పడిన సంబంధాలు, ప్రజల కోసం చేసిన సేవలే చిరస్థాయిగా ఉండాలన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి మన సత్తా చాటాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు.