స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ నంబర్ల ఆటలు సాగవు!
సూర్య నేషనల్ డెస్క్: సెల్‌ఫోన్ వినియోగదారులకు చిరాకు తెప్పించే అవాంఛిత కాల్స్, సందేశాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు టెలికాం నియంత్రణ మండలి (TRAI) రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మోసపూరిత కాల్స్‌ను ఇట్టే పట్టేసేందుకు కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీని తెరపైకి తీసుకువచ్చింది.
స్పామర్లపై ఉక్కుపాదం.. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రధాన నెట్‌వర్క్‌లు అన్నీ సమిష్టిగా పనిచేసి, స్పామ్ కార్యకలాపాలకు పాల్పడే నంబర్ల సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని ట్రాయ్ తేల్చిచెప్పింది. ఒకే వ్యక్తి లేదా సంస్థకు చెందిన ఐదు లేదా అంతకంటే ఎక్కువ నంబర్లు కేవలం పది రోజుల వ్యవధిలో స్పామ్‌గా రిపోర్ట్ అయితే, ఆయా నంబర్లపై తీవ్రస్థాయిలో విచారణ చేపడతారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే.. ఆ నంబర్ల కేవైసీ (KYC) మళ్లీ పరిశీలించడం, భౌతిక ధ్రువీకరణ చేయడం, అవుట్‌గోయింగ్ కాల్స్ నిలిపివేయడం లేదా ఆ కనెక్షన్‌ను శాశ్వతంగా రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోనున్నారు.
A2P కాల్స్‌పై ప్రత్యేక నిఘా, ఛార్జీల బాదుడు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్లు, రోబోటిక్ వాయిస్‌లు లేదా రికార్డెడ్ సందేశాల ద్వారా వచ్చే 'అప్లికేషన్-టు-పర్సన్' (A2P) కాల్స్ విషయంలోనూ ట్రాయ్ నిబంధనలు మార్చింది. ఇలాంటి కాల్స్ నిర్వహించే సంస్థలు ముందుగానే తమ నంబర్ల వివరాలను ఆయా టెలికాం ఆపరేటర్లకు అధికారికంగా తెలపాలి. ఈ ప్రక్రియను పాటించని కాల్స్‌ను నేరుగా స్పామ్ కిందకే పరిగణిస్తారు. అంతేకాకుండా, నిర్దిష్ట మినహాయింపులతో కూడిన A2P కాల్స్‌కు నిమిషానికి గరిష్టంగా 5 పైసల వరకు టెర్మినేషన్ ఛార్జీని వర్తింపజేస్తూ సవరణలు చేశారు. అయితే, వ్యాపార సంస్థల అధికారిక కమ్యూనికేషన్ సిరీస్ నంబర్లకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆ నంబర్లను బ్లాక్ చేసేయకండి! ట్రాయ్ ప్రత్యేకంగా కేటాయించిన 140xx, 1600xx, 1601xx సిరీస్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను ట్రూకాలర్ (Truecaller) లాంటి థర్డ్-పార్టీ యాప్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ చేయడం, ఫిల్టర్ చేయడం లేదా స్పామ్ ట్యాగ్‌లుగా మార్చకూడదని స్పష్టం చేసింది. ఈ సిరీస్‌లను కేవలం అత్యవసర వాణిజ్య, సేవా సంబంధిత సమాచారంకోసం మాత్రమే ఉపయోగిస్తారని గుర్తుచేశారు.
ఫిర్యాదుల కోసం సులభమైన వేదిక ఒకవేళ వినియోగదారులకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే, వారు తమ అప్పీళ్లను లేదా ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకునే సదుపాయాన్ని ట్రాయ్ కల్పించింది. 'డీఎండీ' (DND) యాప్, ఆపరేటర్ల అధికారిక పోర్టల్స్ ద్వారా లేదంటే '1909' నంబర్‌కు కాల్/మెసేజ్ చేసి కేవలం 15 రోజుల్లోపు అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించవచ్చు. టెలికాం రంగంలో పారదర్శకతను పెంచడంతో పాటు, కస్టమర్ల ప్రైవసీని కాపాడటమే ఈ కొత్త రూల్స్ ప్రధాన ఉద్దేశమని ట్రాయ్ స్పష్టం చేసింది.