పక్కా ప్లాన్‌తో మహిళపై దాడి.. 24 గంటల్లోనే కేసు ఛేదించిన క్రైమ్ పోలీసులు
గాజువాక, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ : పాత పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, పక్కా పథకం ప్రకారం ఓ మహిళను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి దాడి చేసి బంగారు తాళిబొట్ల త్రాడును దోచుకెళ్లిన ఇద్దరు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ఎ. వెంకట్రావు వెల్లడించారు. గాజువాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు తెలిపారు. నిందితురాలు వంపూరు ఉషారాణికి బాధితురాలు మద్ది గీత భవానీతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, ఆటో డ్రైవర్ బత్తుల తిరుపతిరావుతో కలిసి తమ జల్సాల కోసం దోపిడీకి వ్యూహం పన్నింది. పథకం ప్రకారం బాధితురాలిని నమ్మించి జింక్ గేట్ సమీపంలోని శివాలయం రోడ్డు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లగా, తిరుపతిరావు హెల్మెట్ ధరించి స్కూటీపై వచ్చి ఆమెపై దాడి చేసి మెడలోని సుమారు రెండు తులాల బంగారు తాళిబొట్ల త్రాడును లాక్కెళ్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఉషారాణి అక్కడే ఫిట్స్ వచ్చినట్లు నటించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి చోరీ సొత్తుతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితులను పట్టుకోవడంలో క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు, ఎస్సై సిహెచ్. హరికృష్ణ బృందం చూపిన ప్రతిభను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.