పామూరులో నేటి నుంచి సోలార్‌పై సేవా సేతు
- పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన
- రాయితీలపై వినియోగదారులకు వివరాలు
- స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంకు రుణాల సదుపాయం
పామూరు, మేజర్ న్యూస్ : విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పామూరు సబ్‌డివిజన్ పరిధిలోని పామూరు, వెలిగండ్ల, సీఎస్‌పురం మండలాల విద్యుత్ వినియోగదారులకు సోలార్ విద్యుత్‌పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 6, 7, 8 తేదీల్లో సేవా సేతు అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. ఉమాకాంత్ తెలిపారు. పామూరులోని ఆర్‌అండ్‌బీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ ఏర్పాటు ప్రభుత్వం అందించే రాయితీలపై వినియోగదారులకు అవగాహన కల్పించనున్నారు. పామూరు, వెలిగండ్ల, సీఎస్‌పురం మండలాలకు చెందిన విద్యుత్ అధికారులు, సోలార్ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకు అధికారులు పాల్గొని పథకం ద్వారా లభించే రాయితీలు, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుపై వివరాలు అందించనున్నారు. సూర్యఘర్ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకునే వినియోగదారులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, విద్యుత్ బిల్లు, పంచాయతీ పన్ను రశీదు తదితర ముఖ్యమైన పత్రాలను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. విద్యుత్ బిల్లుల్లో పేర్లకు సంబంధించి ఉన్న తప్పులను కూడా సరిచేసుకోవచ్చని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ముందుకు రావాలని భవిష్యత్ తరాలకు బంగారు వెలుగులు అందించేలా సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. ఉమాకాంత్ కోరారు.