నేడ కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మలయప్పస్వామి అభయం
తిరుమల:తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో సాగిన ఈ వాహన సేవలో గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఇక రాత్రి జరగనున్న వాహన సేవలో శ్రీమలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. సర్వ లోకాలను ఏలే భూపాలురకు (రాజులకు) తానే అధిపతినని చాటిచెప్పేందుకు స్వామివారు ఈ సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తారు. ఈ దివ్య దర్శనాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ అధికారులు భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీవారి వాహన సేవల్లో మంగళవాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.