నర్సింగోలులో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామానికి రానున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, రాష్ట్ర మ్యారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు సమీక్షించారు. హెలిప్యాడ్, ప్రజా వేదిక, అనంతరం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశానికి సంబంధించిన సభా స్థలాలలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లపై వివిధ శాఖలకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తిచేసేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. దీనికోసం ఆర్డీఓను సమన్వయ అధికారిగా నియమించామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, స్వర్ణ అవార్డు సచివాలయాల అధికారి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు.