నదీ తీర ప్రజలు అప్రమత్తం
శ్రీకాకుళం, అక్టోబర్ 27 మేజర్ న్యూస్ : వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాలలో రాబోయే ఐదు రోజుల్లో ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం పెరిగే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యంగా ఈ నెల 28, 29 తేదీల్లో వరద ప్రవాహం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం, నీటిపారుదల శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
ప్రాజెక్టుల వారీగా అంచనాలు:
నారాయణపురం ఆనకట్ట వద్దకు 1.00 నుండి 1.80 లక్షల క్యూసెక్కులు, తోటపల్లి వద్దకు 41,500 నుండి 72,500 క్యూసెక్కుల మేర వరద నీరు చేరే వీలుంది. అలాగే గొట్టా బ్యారేజీ వద్ద 60,900 నుండి 1.10 లక్షల క్యూసెక్కులు, మడ్డువలస రిజర్వాయర్‌కు 59,000 నుండి 1.08 లక్షలు, మహేంద్రతనయ నదికి 16,200 నుండి 18,300 క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఈ ప్రవాహాల కారణంగా ఆయా ప్రాంతాల్లో 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటే అవకాశమున్నందున తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ముందస్తు రక్షణ చర్యలు – ప్రజలకు విజ్ఞప్తి:
నదీ పరీవాహక ప్రాంతాల పరిధిలోని గ్రామాల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, యంత్రాంగం అన్ని విధాలా అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.
* నాగావళి పరిధిలోని ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, పొందురు మండలాలతో పాటు శ్రీకాకుళం నగరంలోని లోతట్టు ప్రాంతాల (గుజరాతీపేట, ఫజుల్‌బేగ్‌పేట తదితరాలు)లోని 53 గ్రామాలు, అలాగే వంశధార పరిధిలోని నరసన్నపేట, జలుమూరు, పొలాకి, కొత్తూరు, గార తదితర తీర మండలాలలోని 114 గ్రామాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరద ఉద్ధృతి తగ్గే వరకు నదుల వైపు వెళ్లడం, పశువులను నదీ తీరాల్లో మేపడం పూర్తిగా మానుకోవాలని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, క్షేత్రస్థాయి సిబ్బంది ఆదేశాల మేరకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర సమాచారం లేదా సహాయం కోసం మండల, జిల్లా కేంద్రాల్లోని కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని కోరారు పరిస్థితిని జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, ప్రజల రక్షణే ధ్యేయంగా అన్ని శాఖలు సంసిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలియజేశారు.