మీ రాక మాకు పండుగ
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
“మీరు రాకముందు అడవి మధ్యలో ఉండే మా బతుకుల్లో వెలుగులు లేవు.. మా గ్రామాలకు సరైన రోడ్లు లేవు.. ఆటోలు, అంబులెన్సులు వచ్చే పరిస్థితి లేదు. మీ రాకతో మా గ్రామానికి పండుగ వచ్చింది. మీరు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా మా గిరిజన గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి” అంటూ గిరిజనులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాకోట గ్రామంలో నిర్వహించిన ‘మన ఊరు–మాటా మంతి’ కార్యక్రమంలో తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న ఉప ముఖ్యమంత్రి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రి తమ గ్రామానికి రావడం అభివృద్ధికి పెద్ద ముందడుగని గిరిజనులు అభిప్రాయపడ్డారు.
మా నిజజీవిత కథానాయకుడు మీరే!
రాకోటకు చెందిన కుర్ల కృష్ణవేణి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు తమ గ్రామంలో రహదారులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. తమ కష్టాలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. “మీరు మా నిజజీవిత కథానాయకుడు. మీ రాక మాకు జీవితాంతం గుర్తుండిపోతుంది” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
చీయువతకు క్రీడా సామగ్రి పంపిణీ
గ్రామ పర్యటనలో భాగంగా యువతను ప్రోత్సహించడంపైనా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. మాటా మంతి కార్యక్రమం ముగిసిన అనంతరం రాకోట గ్రామానికి చెందిన 40 మంది యువకులకు వాలీబాల్, క్రికెట్ క్రీడా సామగ్రిని అందజేశారు. గ్రామీణ యువత క్రీడల్లో రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ సామగ్రిని పంపిణీ చేశారు.