కొత్తపల్లిలో రూ.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన..!
అభివృద్ధి పనులకు నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
వరికుంటపాడు, మేజర్ న్యూస్ : వరికుంటపాడు మండలం, జి.కొండారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.35 లక్షల వి.బి.జి. రాంజీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలగడంతో పాటు వర్షాకాలంలో రోడ్లపై ఏర్పడే ఇబ్బందులు కూడా తగ్గుతాయని ఎమ్మెల్యే తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.