కూటమిలో కల్లోలం!
విజయనగరం బ్యూరో, సూర్య: కొన్నాళ్లుగా అందరూ ఊహించినట్టే జరుగుతోంది. అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు కల్లోలం సృష్టించింది. టీడీపీ తీరుపై మండిపడుతూ జనసేన శ్రేణులు మిత్రధర్మం తూనా బొడ్డు అంటూ విడిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు, కూటమి పెద్దల నిర్ణయంపై మండిపడుతూ కొన్నిచోట్ల టీడీపీ మిత్రధర్మానికి విరుద్ధంగా నామినేషన్లు దాఖలు చేసింది. మంత్రి సంధ్యారాణి సాలూరు మున్సిపాలిటీని ఎస్సీలకు కేటాయించడాన్ని ఏకంగా అధిష్ఠానంపైనే నిప్పులు చెరిగారు. మిగిలిన చోట్లా దాదాపుగా ఇదే సీను కనిపిస్తోంది. విజయనగరం చైర్మన్ సీటు టీడీపీకి కేయాయించగా, కార్పొరేటర్ల స్థానాల సంఖ్యపై తమను చిన్నచూపు చూశారని ఆరోపిస్తూ జనసేన ఏకంగా చైర్మన్ స్థానంతోపాటు నగర పాలక సంస్థ పరిధిలోని 62 డివిజన్లకు నామినేషన్లు దాఖలు చేసి, టీడీపీ చేసిన అవమానానికి బదులు తీర్చుకుంటామన్న సంకేతాలు పంపింది. నిజానికి ఇక్కడ తమపార్టీకి గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు కేటాయించాలని కోరితే, అలాచేయకపోగా, గెలుపు అనుమానమైన స్థానాల్లో అదికూడా ఐదారు స్థానాలే కేటాయిస్తామని చెప్పడంతో ఆపార్టీ నేతలు అగ్గిమీద గుగ్గిలమై చివరకు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఇప్పుడు నగరపాలక సంస్థలో చైర్మన్ పదవికి కూటమిలోని రెండుపార్టీలు పోటీచేసే పరిస్థితి ఏర్పడింది. అలాగే, 62 డివిజన్లలోనూ జనసేన నామినేషన్లు వేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా కూటమి పార్టీలమధ్య సయోధ్య కుదరకపోతే ఇక్కడ పోటీ రసవత్తరంగా మారుతుంది. సాలూరు మున్సిపాలిటీ ఎస్సీలకు కేటాయింపుపై మంత్రి సంధ్యారాణి ఏకంగా అధిష్ఠానం పైనే బహిరంగంగా అక్కసు వెళ్లగక్కారు. సహచర మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో, బహిరంగ సభా వేదికపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఒకదశలో భావోద్వేగానికి లోనయ్యారు. పులిమీద పుట్రలా పార్వతీపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సాలూరు, పార్వతీపురాన్ని జనసేనకు కేటాయించడమేంటని అధినేతను నిలదీసేంతవరకు వెళ్లి సంచలనానికి కేంద్రబిందువుగా మారారు. హైకమాండ్ నిర్ణయం తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నర్ధకం చేసిందన్న ఆక్రోశం ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది. ఇక, నెల్లిమర్ల నగర పంచాయతీ రాజకీయం రోజురోజుకూ గరంగరంగా మారుతోంది. ఇక్కడి చైర్మన్ స్థానాన్ని బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఆపార్టీ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ తెరపైకిరాగా, ఎప్పట్నుంచో దీనిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ ఒక్కసారిగా అవాక్కై పార్టీనేత లెంక అప్పలనాయుడుతో చైర్మన్ స్థానానికి నామినేషన్ వేయించడమేకాకుండా, మొత్తం 23 వార్డులకూ ఆపార్టీవారితో నామినేషన్ వేయించారు. దీంతో, జనసేన బీజేపీకి మద్దతుగా నిలిచి కూటమి ధర్మానికి కట్టుబడి బీజేపీకి సహకరిస్తున్నట్టు జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి స్పష్టం చేశారు. ఇంకోవైపు, లెంక అప్పలనాయుడుతో నామినేషన్ ఉపసంహరించేందుకు టీడీపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరడం విశేష పరిణామంగా చెప్పవచ్చు. టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన జగదీష్.. పార్వతీపురం జనసేనకు కేటాయించిన క్రమంలో ఏకంగా పార్టీ మార్చడం అపార్టీలో పరిస్థితికి అద్దంపడుతోంది. ఎస్కోటలోనూ టీడీపీలో అసంతృప్తి సెగలు బైటకు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి వర్సస్ డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ గా ఇక్కడ ప్రచ్ఛన్నయుద్దం నడుస్తోంది. దీనిప్రభావం కేడర్ పైనాపడి వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. జిల్లాలోని మెంటాడ మండలం టీడీపీలో రిజర్వేషన్ కుంపటి రాజుకుంటోంది. మంత్రి సంధ్యారాణి ఒంటెత్తుపోకడలవల్లే ప్రతికూల రిజర్వేషన్లు తెరపైకి వచ్చాయని శ్రేణులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నేరుగా ఆమె ఎదుటే చెప్పినట్టు సమాచారం. చీపురుపల్లిలో వింత పరిస్థితి ఏర్పడింది. చిన్నశ్రీను ఎపిసోడ్ నేపథ్యంలో ఆయన వెంట వెళ్లిన వైసీపీ శ్రేణులు.. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో మళ్ళీ సొంతగూటివైపు చూస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్లలో చైర్మన్ కేటాయింపు రాజేసిన అగ్గికి, మరో వివాదం కూడా తోడై టీడీపీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ప్రస్తుతానికి ఇది నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒకట్రెండు రోజుల్లో బైటపడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు, స్థానిక స్థానాలకు రిజర్వేషన్లు కేటాయింపు కూడా టీడీపీలో అసంతృప్తికి కారణమవుతోంది. ఇలాఉండగా, జిల్లాయే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను బీజేపీ అంతగా పట్టించుకోకపోవడం పరిశీలకులను ఆశ్చర్య పరుస్తోంది. ఇది వ్యూహాత్మక మౌనమా, మరేదైనా కారణమా అనేది పరిశీలకులకు అంతుబట్టడంలేదు. ఇంకోవైపు, తాజా పరిణామాలను వైసీపీ నిశితంగా గమనిస్తూ అసంతృప్తులకు గాలంవేసేందుకు ప్రయత్నిస్తోంది. నిన్నమొన్నటి వరకూ నిస్తేజంగా ఉన్న ఆపార్టీ శ్రేణుల్లో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ, ఉమ్మడి జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతుండడం విశ్లేషకవర్గాలను విస్మయపరుస్తోంది.