జిల్లాలో సమృద్ధిగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీతో పాటు నిత్యావసర వస్తువుల నిల్వలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్లతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా సరఫరా చేసే బియ్యం, చక్కెర తదితర నిత్యావసర వస్తువుల నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మి ముందస్తుగా అధిక మొత్తంలో కొనుగోళ్లు చేయవద్దని ఆయన సూచించారు.
నవంబర్ 2, 2026 నాటికి జిల్లాలోని 267 పెట్రోల్ బంకుల్లో 1,710 కిలోలీటర్ల పెట్రోల్, 2,832 కిలోలీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, 57 ఎల్పీజీ అవుట్‌లెట్లలో 21,385 సిలిండర్లు నిల్వ ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 1,470 చౌకధరల దుకాణాల పరిధిలో 10,832.215 మెట్రిక్ టన్నుల బియ్యం, 374.727 మెట్రిక్ టన్నుల చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోu నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత ఏర్పడకుండా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటిస్తూ సాధారణ అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేయాలని, వదంతులను నమ్మవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.